గవర్నర్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

-

గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో దుమారం రేగుతోంది. టీఆర్‌ఎస్ మంత్రులు గవర్నర్ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై, అధికారులపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తాజాగా గవర్నర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ను రాజకీయ వేదికగా మార్చాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గవర్నర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను అపఖ్యాతి పాలు చేయాలని తమిళిసై భావిస్తున్నారని కవిత విమర్శించారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలు పొందుదామని భాజపా చూస్తోందని.. గవర్నర్ ద్వారా ఇలాంటి ప్రకటనలు చేయిస్తోందని విరుచుకుపడ్డారు.

అసలేం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం గవర్నర్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ రాజ్‌భవన్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ఇక్కడి అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version