ఆ ఎమ్మెల్సీ సీఎంవో పై ఒత్తిడి తెచ్చి మరి బదిలీలు ఆపించేశారా ?

-

ఆ అధికారి నిర్ణయం..అధికారపార్టీ ఎమ్మెల్సీ గుండెళ్లో రైళ్లు పరుగెత్తించింది ఇక అంతే సీఎంవోపై ఒత్తిడి తెచ్చి ఆ నిర్ణయం ఆపేవరకు ఆయన నిద్రపోలేదట. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇతర జోన్‌లోని వారిని నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌ బదిలీ చేశారని చెబుతున్నారు. వాస్తవానికి ఇలాంటి ప్రక్రియపై బ్యాన్‌ ఉంది. అయినా రాత్రికి రాత్రే ఆర్డర్స్‌ ఇచ్చి..లెక్చరర్లు జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చేశారట. అయితే ఈ ట్రాన్సఫర్లపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ వివాదం ఇలా ఉండగానే ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ తెగ ఆందోళన చెందుతున్నారట.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 8 అటానమస్‌ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అడ్మిషన్లు నుంచి రిజల్ట్స్‌ వరకు ఈ కాలేజీలు స్వయంగా నిర్ణయం తీసుకుంటాయి. కొందరు లెక్చరర్లు ఇతర డిగ్రీ కాలేజీల నుంచి వచ్చి ఇక్కడ డెప్యుటేషన్‌పై పనిచేస్తారు. ఇలా అధ్యాపకులు పనిచేయడానికి ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది. నోటిఫికషన్‌ ఇస్తారు. సెలెక్ట్‌ అయిన వారిని కాలేజీ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డెప్యుటేషన్‌ మీద బదిలీ చేస్తుంది. ఎంపికైన వారు తాము పనిచేస్తున్న కాలేజీ నుంచి రిలీవై అటానమస్‌ కాలేజీలో చేరతారు. అయితే ఈసారి ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొందరు అధ్యాపకులకు ఈ ప్రక్రియ నచ్చక రచ్చ చేస్తున్నారన్నది మరో వాదన.

నాంపల్లి సిటీ కాలేజీ, బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజీలకు PhD ఉన్నవాళ్లు రావడం ఇష్టం లేకే దుష్ప్రచారం మొదలు పెట్టారని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించలేదంటున్నారు సంబంధిత శాఖ అధికారులు. ఈ వివాదం ఇలా ఉండగానే ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ తెగ ఆందోళన చెందుతున్నారట. త్వరలో మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు సదరు నాయకుడు. లెక్చరర్ల బదిలీ వ్యవహారం ముదిరి పాకాన పడి తనకు ఎసరు పెడుతుందోనని ఆ ఎమ్మెల్సీ కలవర పడుతున్నారట. సీఎంవోలో విద్యాశాఖ చూసే అధికారిని కలిసి వెంటనే బదిలీలు ఆపాలని కోరారట. అంతేకాదు.. ఎవరికి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారని కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ను ప్రశ్నించారట.

ఈ ఎమ్మెల్సీ హడావిడితో బదిలీలు ఆపేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారని సమాచారం. ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్లు పొంది ఇంకా రిలీవ్‌ కాని లెక్చరర్లను రిలీవ్‌ చేయవద్దని కాలేజీలకు ఆదేశాలు వెళ్లాయట. ఇప్పటికే జాయిన్‌ అయిన వారిని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత కమిషనర్‌ గతంలో తీసుకున్న నిర్ణయాలూ వివాదాస్పదం అయ్యాయి. వృత్తి విద్యా కాలేజీల షిఫ్టింగ్‌ వివాదాస్పదం అయింది. ఎయిడెడ్‌ కాలేజీల అంశంలోనూ అదే జరిగింది. ఇప్పుడు అటానమస్‌ కాలేజీ లెక్చరర్ల బదిలీపై లొల్లి జరుగుతోంది. కమిషనర్‌కు.. ప్రభుత్వానికి దగ్గరగా ఉండే ఓ నేతకు పడకపోవడం వల్లే ఇలాంటి వివాదాలు తెరపైకి వస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version