దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని స్వయంగా మన ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్(ఎక్స్) లో వెల్లడించారు. అద్వానీ భారతరత్నకు ఎంపిక అవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతూ…దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషిని మరువలేమంటూ ఆయనని కొనియాడారు.
ఇదిలా ఉంటే….భారతరత్నను మోదీ ప్రభుత్వం కించపరుస్తోందని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.అద్వానీలాంటి వ్యక్తులకు ఈ గౌరవం ఇచ్చి భారతరత్న ప్రాధాన్యతను దిగజారుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లోని జిన్నా సమాధి దగ్గరకి వెళ్లిన అద్వానీ ,దేశం విడిపోవడానికి కారణమైన జిన్నాని అద్వానీ పొగిడారని అన్నారు. అంతేకాకుండా అద్వానీ రథయాత్ర చేసిన ప్రతీచోటా మతకల్లోలాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోయాయని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు . అద్వానీకి భారతరత్న ఇచ్చి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.