మొసలి నోట్లోంచి కొడుకును కాపాడుకున్న మహాతల్లి

-

మరో క్షణంలో ప్రాణం విడువబోయే కొడుకు కోసం ఆ తల్లి వెనకాముందు ఆలోచించలేదు. పిల్లల కోసం తల్లి పడే ఆరాటం, చేసే పోరాటం ఎలా ఉంటుందో మరోసారి ప్రపంచానికి చాటింది ఓ ధీర వనిత.

కన్నపేగును కాపాడుకోవడానికి, ఓ తల్లి అత్యంత ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి విజయం సాధించింది. విన్నోళ్లు, కన్నోళ్లు జయజయధ్వానాలుచేస్తుండగా, ఆ కన్నతల్లి మాతృప్రేమ ప్రజలందరి చేత కన్నీళ్లు కురిపించింది. వింటేనే వొంట్లో వణుకొచ్చే ఈ ఘటన జింబాబ్వేలో జరిగింది. మౌరినా ముసిసిన్యానా (30) అనే ఓ మహిళ, తన ఇద్దరు పిల్లలతో చేపలు పట్టడానికి దగ్గర్లో ఉన్న రుండే నదికి వేటకు వెళ్లింది. పిల్లలిద్దరినీ అక్కడే ఒడ్డున ఉన్న ఓ గొడుగు కింద కూర్చోబెట్టి, తన కొద్ది దూరంలో చేపలు పడుతోంది. ఇంతలో పెద్ద కేక విన్న మౌరినా, అటువైపు చూసేసరికి తన చిన్న కొడుకు, మూడేళ్ల గిడియన్‌ను ఓ మొసలి నోట కరచుకోవడం కనిపించింది. అంతే… వెంటనే పరుగెత్తికెళ్లి, అమాంతం ఆ మొసలిపైకి దూకింది. అక్కడే తను ధైర్యం కోల్పోకుండా, సమయస్ఫూర్తి ప్రదర్శించి, మొసలి ముక్కురంధ్రాలలో ఒక చేతి వేళ్లు దూర్చి, మరో చేత్తో, దాని నోట్లో ఉన్న కొడుకును పట్టుకుంది. దాంతో శ్వాసకు ఇబ్బంది ఏర్పడి, ఆ మొసలి నోరు తెరిచింది. అప్పటికే కొడుకుని పట్టుకుని ఉన్న మౌరినీ వెంటనే పిల్లాడిని దూరంగా విసిరేసింది. కానీ ఈ సాహసంలో మౌరినా చేయిని మొసలి కొరికింది.


గొనార్జూ జాతీయ వనం దగ్గర జరిగిన ఈ భయంకర సంఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మొసలి తలను కోరలతో పట్టుకోవడం వల్ల ముఖంపై తీవ్ర గాయాలయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెరుగైన చికిత్సనందించారు. ప్రస్తుతం గిడియన్‌ పూర్తిగా కోలుకుని తన తల్లి ఒడిలో బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాడు.

జరిగిన ఈ సంఘటన గురించి మౌరినాను అడిగితే, ‘‘ నేను మా పూర్వీకుల నుంచి విన్న చిన్న కిటుకును వాడాను. మొసలి నోట చిక్కినప్పుడు దాని ముక్కును ఇబ్బంది పెట్టగలిగితే, అది పట్టు సడలిస్తుందని చెప్పారు. సరిగ్గా దాన్నే నేను వాడాను.’’ అని చెప్పింది. అంత ధైర్యమెలా చేసావని అడిగితే, నేనేమీ ఆలోచించలేదని, అసలు ఆ సమయంలో నా మెదట్లో నా కొడుకును కాపాడాలనే ధ్యాస తప్ప మరోటి లేదని చెప్పిన ఆ తల్లి, ఇప్పుడు జరిగిందంతా నమ్మలేకపోతున్నానని, ఇదంతా నిజమేనా అనే సందేహం వస్తోందని నవ్వుతూ అంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version