టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్సెస్ బీజేపీ ఎంపీ ఆరవింద్ అన్నట్లు మాటల యుద్ధం నడుస్తోంది.. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై కవిత కౌంటర్ ఇస్తే.. కవిత కౌంటర్ కు ఎంపీ అర్వింద్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తాజాగా అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తన చేతిలో ఎదురైన ఓటమి నుంచి బయటపడేందుకు కవితకు మూడేళ్ల సమయం పట్టిందని అరవింద్ సెటైర్ వేశారు. ఈ విమర్శల లొల్లి అవసరం లేదని, రైతుల కోసం తాను చేయాల్సింది చేస్తానని, కవిత కూడా తాను చేయాలనుకుంటున్నది చేసుకోవచ్చని వెల్లడించారు అర్వింద్.
2024లో జరిగే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్లీ తనపైనే పోటీ చేయాలని ఆమెను కోరిన అర్వింద్.. దూద్ కా దూద్, పానీ కా పానీ హో జాతా అంటూ కవితకు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రజలకు సేవ చేసేందుకు అరవింద్‌కు మూడేళ్ల సమయం ఇచ్చానని.. ఈ మూడేళ్లలో నిజామాబాద్‌కు అరవింద్ ఏం చేశారని కవిత కౌంటర్ ప్రశ్నించడంతో ఎంపీ అర్వింద్ పై విధంగా స్పందించారు.