వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఈరోజు కూడా విచారణ చేపట్టారు. విచారణ ముగిసిన తరువాత అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తాను విచారణ కోసం ఈ ఉదయం 10.30 గంటలకే సీబీఐ కార్యాలయానికి వచ్చానని, ఉదయం 11.00 గంటల నుంచి ఒంటి గంట వరకు తనను విచారించారని అవినాష్ తెలిపారు. ఆ తర్వాత కోర్టు నుంచి పిలుపు వచ్చిందని సీబీఐ విచారణ అధికారి కోర్టుకు వెళ్లారని, తనను సీబీఐ కార్యాలయంలోనే ఉండాలని చెప్పారని అవినాశ్ రెడ్డి వివరించారు. సీబీఐ అధికారి కోర్టు నుంచి వచ్చి, ఇవాళ్టికి విచారణ ముగిసిందని చెప్పారని, తాము పిలిచినప్పుడు మరోసారి రావాలని అన్నారని ఆయన పేర్కొన్నారు.
ఇంతకుముందు కూడా రెండుసార్లు సీబీఐ విచారణకు నేను హాజరయ్యాను. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరినా గత రెండు పర్యాయాలు వారు పట్టించుకోలేదు. అందుకే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నేను ఇప్పటిదాకా సీబీఐ కార్యాలయంలో ఉండడంతో కోర్టులో ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు. తప్పుడు ఎవిడెన్సులతో అన్యాయంగా అమాయకులను ఇరికించడం తప్పు. ఈ దర్యాప్తులో కీలక అంశాలను పక్కనబెట్టి చాలా సిల్లీ అంశాలను తెరపైకి తెచ్చారు. మీకు ఇది కొత్తేమో కానీ, ఓ ఎంపీ సీటు కోసం ఈ హత్య జరిగిందంటే మా జిల్లాలో అందరు నవ్వుతారు. ఇప్పటివరకు మీడియా ఎన్నో విమర్శలు చేపట్టింది. మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఒకటే చెబుతున్నా, మనం ఎలాంటి తప్పు చేయలేదు అని కార్యకర్తలకు గట్టిగా హామీ ఇస్తున్నా. ఎంతదూరం వెళ్లయినా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అవినాశ్ రెడ్డి స్పష్టంగ చెప్పారు.