అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అరెస్టు ఖాయం – రఘురామకృష్ణ

-

మాజీమంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గార్ల అరెస్టు తప్పనిసరని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. పోలీసు అధికారి చెప్పిన దాని ప్రకారం అరెస్టు తప్పనిసరి కానీ అరెస్టు కాకూడదు అన్నది నా కోరిక… అవుతారనేది నా నమ్మకం అని అన్నారు. వివేకానంద రెడ్డి హరి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ఆధారంగా వై.యస్. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గార్ల అరెస్ట్ తప్పదని మాజీ పోలీసు అధికారి ఒకరు తనకు వెల్లడించారని వివరించారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందు, తరువాత వై.యస్. భాస్కర్ రెడ్డి గారి నివాసంలో నిందితులంతా సమావేశమైనట్టు గూగుల్ టేక్ అవుట్ ద్వారా స్పష్టమైన ఆధారాలు లభించినట్లుగా సీబీఐ తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొందని చెప్పారు. ఇదే విషయాన్ని సదరు పోలీసు అధికారి ప్రస్తావిస్తూ, ఒకవేళ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గార్లను అరెస్టు చేయకపోతే, అదే న్యాయస్థానంలో సీబీఐ పెను సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారన్నారు.

ఇప్పటికే అప్రతిష్ట పాలైన సీబీఐ మరింత అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. చార్జిషీట్లో మోపిన అభియోగాలే తప్పయితే శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరి వీళ్ళు ఎవరు కూడా వై.యస్. వివేకానంద రెడ్డి గారిని హత్య చేయలేదని ఆకాశము నుంచి గంధర్వులు, కిం పురుషులు దిగివచ్చి హత్య చేసి వెళ్లిపోయారని అంటే ఏమీ చేయలేమన్నారు. విచారణ చేసేది సీబీఐ సంస్థ, సాక్షి దినపత్రిక యాజమాన్యం కాదని ఎద్దేవా చేశారు. సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలే చెల్లుతాయని, సాక్షి దినపత్రికలో రాసే ఊహాజనిత కథనాలకు కోర్టులు ప్రభావితం కావని రఘురామకృష్ణ రాజు గారు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version