ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని ఆలూరు రోడ్డుపై చిప్పగిరి రైల్వే బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు, గుంతకల్లుకు చెందిన లక్ష్మీనారాయణ చిప్పగిరి వెళ్లుతున్న సమయంలో, ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు టిప్పర్ వాహనంతో ఢీకొట్టారు.

ఘటనా స్థలంలో కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించినా, మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందినట్టు తెలుస్తోంది. ఎందుకు లక్ష్మీనారాయణను టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఈ దారుణ ఘటన వెనుక అసలు కారణాలేంటి? దాడి చేసినవారు ఎవరు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.