టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(dhoni) నేడు తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనీకి వివిధ ప్రముఖులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంఎస్‌డీ తనదైన ముద్ర వేసాడు. అందరు మెచ్చిన నాయకుడిగా, బెస్ట్ ఫినిషర్ గా, గొప్ప వికెట్ కీపర్ గా భారత క్రికెట్ లో చెరగని ముద్ర వేసాడు మహేంద్రుడు. యువ ఆటగాళ్ళలోని ప్రతిభ వెలికి తీసి వారిని ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు. అందుకే యువ ఆటగాళ్ళకు ధోనిపై ఎంతో గౌరవం ఉంటుంది. కాగా తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో ఘనతలు సాధించిన ధోని ప్రపంచ క్రికెట్ చరిత్రలోనూ ఎవరికీ సాధ్యం రికార్డును సాధించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ గా ధోని నిలిచాడు. ఐసీసీ ట్రోఫీలతో పాటు రెండు ఆసియా కప్‌లు, మూడు ఐపీఎల్ ట్రోఫీలను సాధించాడు ధోని.
కాగా 2004, డిసెంబర్ 23న ధోని బంగ్లాదేశ్ పై అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మూడేళ్ళకే టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్న ధోని.. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను గెలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. అప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో ధోనికి అనుభవం తక్కువే. అయినప్పటికీ సీనియర్లు, జూనియర్లను కలుపుకొని జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించి తన కెరీర్ లో తొలి ఐసీసీ ట్రోఫీ సాధించాడు.
అనంతరం 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను జగజ్జేతగా నిలిపి 28 ఏళ్ళ భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరదించాడు. అనంతరం 2013లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆతిథ్య జట్టును మట్టి కరిపించి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు 2010, 2016లో జరిగిన ఆసియాకప్‌లు సాధించాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తనకు తిరుగులేదని మహీ నిరూపించుకున్నాడు. 2010, 2011, 2018లో మొత్తం మూడుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రోఫీలు అందించాడు.