పొట్ట కూటి కోసం కోటి విద్యలు” అవును ఆకలితో అలమటించే జనం తమ కడుపు నింపుకోవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఒకరు పనులు వెతుక్కుంటే మరొకరు బిచ్చం ఎత్తుకోవడం, మరొకరు అన్నదానాల కోసం ఎదురు చూడటం, మరొకరు ఎవరైనా ఏమైనా పెడతారా అని ఎదురు చూడటం, ఏది సాధ్యం కాకపోతే వీధి వేషాలు వేయడం వంటివి చేసి కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పో ఒప్పో ఆకలి కేకలు వేయడం కంటే… అన్నమో రామచంద్రా అని అలమటించి చావడం కంటే ఏదోకటి చేయడమే నయం కదా…?
ఇలాగే చేసాడు ఒక యువకుడు… కాని మతం కారణంగా అతను దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో గల సుష్మానగర్ ప్రాంతంలో ఒక ప్రముఖ ఆలయం వద్ద హనుమతుని వేషం వేసుకుని ఒక యువకుడు యాచన చేస్తున్నాడు. అతనిని కొందరు వ్యక్తులు గమనించారు… అతనిని నిలదీసి పేరు, ఊరు, ఇతర వివరాలు అడిగారు. నా పేరు నసీం అని చెప్పాడు ఆ యువకుడు… ఆ అడిగిన వాళ్ళు ఎవరో కాదు భజరంగ్ దళ సభ్యులు. వెంటనే అతనిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు.
కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను ఆకలి కేకలతోనే ఈ పని చేసానని అంగీకరించాడు. దీనిపై ఫిర్యాదు చేసిన వాళ్ళు మాట్లాడుతూ అతను హనుమంతుని వేషం వేసుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాడని అందుకే అతనిని జైలుకి పంపించామన్నారు. పోలీసుల విచారణలో అతను ఇలాగే వేషాలు వేసుకుని పొట్ట నింపుకుంటాడని పలు దేవాలయాల దగ్గర యాచన చేసాడని తెలియడంతో మరోసారి ఇలాంటివి చేయకుండా పనులు చూసుకోవాలని హెచ్చరించి అతనిని పోలీసులు వదిలేసారు.