ఎవరేం చెప్పినా నేను వినను.. నేను అనుకున్నదే చేస్తాను.. అది మంచా? చెడా? అనేది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నిర్ణయం తీసుకునేది నేనుకదా!!. ఏం చేయాలో? ఎలా చేయాలో? ఎప్పుడు చేయాలో నాకు తెలవదనుకుంటారా? ఏమిటి? అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్‌రెడ్డి. రెండేళ్ల పరిపాలన పూర్తిచేసుకుంటున్న తరుణంలో ప్రజలకు బహుమతి ప్రకటించారు. ఒక రాజధాని నుంచి మూడు రాజధానులకు మారిన తర్వాత నూతన గృహప్రవేశం చేయనున్నారు. అందరినీ భోజనానికి కూడా ఆహ్వానిస్తున్నారు.
కార్యాలయాలు వెదుకుతున్న హెచ్‌వోడీలు
మే 30 నాటికి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తవుతాయి. ఆరోతేదీ నుంచి హెచ్ఓడీలను ప్రారంభిస్తే, 24 రోజుల్లోపు పరిపాలనను గాడిలో పెట్టేసి ముచ్చటగా మూడో ఏడాది నుంచే మూడు రాజధానుల నుంచి విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్వోడీలు తరలిన తర్వాత సచివాలయం కూడా తరలివెళ్లనుంది. వరుసగా కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్న తరుణంలో కూడా జగన్ అడుగు వెనక్కి వేయదలుచుకోలేదు. తాను అనుకున్నదే చూసి చూపించాలనే పట్టుదలతో ఉన్నారు.
జస్టిస్ రమణ ఖరారైన తర్వాతే దూకుడు పెంచిన జగన్
మే 6 నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు రోజుల కిందటే విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన సీఎం తాజాగా వివిధ శాఖల అధిపతులను విశాఖ పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుమారు 130 మంది విభాగాధిపతులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని, సదరు అధికార యంత్రాంతం తమకు అనువైన ప్రాంతాలను ఎంచుకునేందుకు విశాఖలో తిష్టవేసినట్లు తెలుస్తోంది. జడ్జిలపై ఏపీ సీఎం ఫిర్యాదు తర్వాత హైకోర్టులో చిన్నచిన్న మార్పులు జరిగాయేకానీ మూడు రాజధానుల వివాదాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వచ్చే నెలలో జస్టిన్ ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత అమరావతి, మూడు రాజధానుల వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమైని తేలిన తర్వాతే జగన్ తన దూకుడును పెంచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలులో కూడా కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. విశాఖపట్నానికి పూర్తిగా తరలిన తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచించే అవకాశం కనపడుతోందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. దీనిపై కొన్నిరోజులు గడిస్తేకానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడటంలేదు.