జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక కార్యక్రమాల్లో ప్రతి సారీ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత అంశాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. పవన్ పెళ్లిళ్లు, ఆయన సినిమాల గురించి మీకు ఎందుకని ప్రశ్నించారు. ఆయన సినిమాలు చేసి డబ్బులు సంపాదించి వాటిని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నట్లు గుర్తు చేశారు. అంతేకాదు పవన్ కల్యాణ్ మీ లాగా అవినీతి చేస్తే ఇలా ఉండరని అన్నారు.
కేవలం ఒక్క టోఫెల్ విషయంలోనే నాలుగేళ్లలో 4 వేల కోట్ల రూపాయలు ఒక సంస్థకు వెచ్చించారని మనోహర్ పేర్కొన్నారు. అది ఎంత మందికి ఉపయోగపడుతుందో చెప్పాలన్నారు. ఈ రకంగా ఎన్నో విషయాల్లో అక్రమాలు చేసి ప్రజా సొమ్మును జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఇన్నేళ్ల పాలనలో సీఎం జగన్ ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని నిలదీశారు.
“ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఎందుకు ఇలా కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడో తేల్చుకుందాం. ఈ ముఖ్యమంత్రికి సంస్కారం నేర్పిద్దాం… అందుకోసం కార్యాచరణ రూపొందించుకుందాం. మానసిక స్థితి సరిగా లేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, పరిపాలించలేక, అభివృద్ధి చేయలేక, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడు” అని నాదెండ్ల విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుతనంతో మాట్లాడుతుంటే రాష్ట్రంలో మహిళలందరూ గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి జిల్లాలోనూ వీరమహిళలు ఈ దిశగా పోరాటానికి సిద్ధం కావాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.