దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. చలన చిత్ర పరిశ్రమల్లో ఎంతో కీలకంగా భావించే ఈ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. గతంలో నడిగర్ సంఘం ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణుల కూడా వచ్చాయి. 2019లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో అప్పుడు ఒక ప్యానెల్ నుంచి నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా పోటీ చేశారు. మరో ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా భాగ్యరాజ్, సెక్రటరీ గణేశన్ బరిలోకి దిగారు. ఆ సమయంలో ఓటింగ్ లో విశాల్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడంతో మద్రాస్ కోర్ట్ కౌంటింగ్ నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత విశ్రాంత జడ్జి సమక్షంలోె ఓట్ల లెక్కింపు ఈ ఉదయం (మార్చి 20) చెన్నైలో జరిగింది. కౌంటింగ్ ముగియడంతో విశాల్ ప్యానెల్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడ్డాయి. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ గెలవగా…కార్యదర్శి, కోశాధికారిగా విశాల్, కార్తీలు గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా కరుణాస్, పూచి మురుగన్ విజయం సాధించారు. 1827 ఓట్లు సాధించిన కార్తీ, తన ప్రత్యర్థి ప్రశాంత్ పై గెలిచాడు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కేవలం 226 ఓట్లు మాత్రమే సాధించారు. కార్యదర్శిగా గెలిచిన విశాల్ 1720 ఓట్లు సాధించిగా.. ప్రత్యర్థి ఈశారి కే గణేష్ 1032 ఓట్లు సాధించారు. అధ్యక్షుడిగా గెలిచిన నాజర్ 1701 ఓట్లు సాధించగా… కే భాగ్య రాజ్ 1054 ఓట్లు మాత్రమే సాధించారు.