నాగశౌర్య హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’. షిర్లీ సేతియా కథానాయిక. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేడుకనుద్దేశించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా టీమ్ అంతా నాకు బాగా పరిచయం. చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఎన్ని సమస్యలున్నా అనీష్ కృష్ణ ముఖంపై చిరు నవ్వు చెరగదు. ఆయన విషయంలో నాకు నచ్చేదదే. శౌర్య విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. ఈ సినిమా ప్రచారాన్ని వినూత్నంగా చేశారు. పాదయాత్ర ఆలోచనే అద్భుతం’’ అని అనిల్ అన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాతో రెండున్నరేళ్లు ప్రయాణించా. ఎన్నో మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయి. ఏ సినిమా ప్రారంభంకావాలన్నా నిర్మాతలే ముఖ్యం. ఐరా ప్రొడక్షన్స్ నాదీ అనటం కంటే మాది అనటం మంచిదనిపిస్తుంది. నాతోనే కాదు వేరే హీరోలతోనూ నా తల్లీదండ్రులు సినిమాలు తీస్తూనే ఉంటారు. కొవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి ఈ సినిమాని తప్పకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నా మీద ప్రేమ వల్లే అలా చేశారు. ‘సినిమా బాగుంటే నా కొడుకు బాగుంటాడు. అతని దర్శకులు, స్టాఫ్ బాగుంటారు’ అనే ఉద్దేశంతోనే అలా చేశారు. ఈ సినిమాలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శకుడు అనీష్‌కు థ్యాంక్స్. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇండస్ట్రీలో నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఆయనే’’ అని శౌర్య తెలిపారు.
‘‘ఈ సినిమాను తన భుజంపై వేసుకుని ముందుకు నడిపించిన నాగశౌర్యకు ముందుగా కృతజ్ఞతలు. ఈ సినిమాలో రాధికగారు కీలక పాత్ర పోషించారు. ఆమె లేకపోతే సినిమాపై మేమింత నమ్మకంగా ఉండేవాళ్లం కాదు. న్యూజిలాండ్‌లో పెరిగిన షిర్లీ సేతియా తెలుగులో సంభాషణలు చెప్పటాన్ని చూసి ఆశ్చర్యపోయా. తన పాత్రకే తానే డబ్బింగ్ చెప్పుకొంది’’ అని దర్శకుడు అనీష్ కృష్ణ తెలిపారు. ‘‘ఈ సినిమాలోని వ్రింద అనే పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డా. నాకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’’ అని కథానాయిక షిర్లీ సేతియా అన్నారు.