జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు.. ఇటీవల కాలంలో జబర్దస్త్ షో నుండి తప్పుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. నాగబాబు ఎందుకు తప్పుకున్నారనే విషయంపై రకరకాల వార్తలు వచ్చాయి. అయితే నాగబాబు జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత జీ తెలుగులో అదిరింది కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కేవలం జడ్జిగా మాత్రమే కాకుండా ఈ షో ప్రమోషన్స్ మొత్తంతో పాటు టీం లీడర్స్ బాధ్యతల్ని కూడా భుజాన వేసుకుని.. జబర్దస్త్‌ను ఎలాగైనా ఢీ కొట్టాలని చూస్తున్నారు.
కానీ, అది సాధ్యం కావడం లేదు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్రం లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్ కారణంగా అన్నిటితో పాటు షూటింగ్ కూడా బంద్ అయ్యాయి. ఈ క్రమంలోనే నాగబాబు ఇంట్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేసారు. ఇప్పటికే ఈయన ఆర్ఆర్ఆర్, మరియు పవన్ కళ్యాన్ మరియు క్రిష్ కాంబోలో వస్తున్న సినిమాలపై అభిమానులతో ముచ్చటించారు. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణం సీఎం కేసీఆర్‌ను వజ్రంతో పోల్చి ఆకాశానికి ఎత్తేశారు.
తాజాగా కరోనా నేపథ్యంలో కేసీఆర్ ఫోటో పెట్టి.. ఆయనపై నాగబాబు ఓ ట్వీట్ చేశారు. అందులో.. “ఈ మధ్య కేసీఆర్ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది.దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు.ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎం లు ఉన్న దేశంలో కేసీఆర్ గారిలాంటి లీడర్స్ వజ్రాల్లా మెరుస్తారు“ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.