బిగ్ బాస్ షోలో ‘నారాయణ’ పదం… క్లారిటీ ఇచ్చిన నాగార్జున

-

సినిమాకు మంచి టాక్‌ వచ్చే విషయంలో రివ్యూలు కీలక పాత్ర పోషిస్తాయని అగ్ర కథానాయకుడు నాగార్జున అన్నారు.  ఆయన ముఖ్య పాత్రలో నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్రం’. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ జంటగా నటించిన ఈ సినిమాను అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించారు. ఇందులో నాగార్జున నంది అస్త్రంగా మెరిశారు. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.

తాను కూడా రివ్యూలు చూశాకే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తానని నాగార్జున చెప్పుకొచ్చారు. ‘‘ఒకప్పుడు సినిమా సమీక్షలు వారం తర్వాత పత్రికలు, సినీ మాగ్యజైన్స్‌లో వచ్చేవి. అప్పటికి ఆ సినిమా ఉందో లేదో కూడా చాలా మందికి తెలిసేది కాదు. అప్పుడు ఆ రివ్యూలను పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలు, వార్తలు అందించే వేదికలు పెరిగిన తర్వాత రివ్యూలకు డిమాండ్‌ పెరిగింది. సినిమా టాక్‌లో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నేను కూడా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలంటే ముందు ఐఎండీబీ రేటింగ్స్‌ చూస్తా. కనీసం వెయ్యి రివ్యూలు, 7 రేటింగ్‌ ఉంటే అప్పుడు ఆ సినిమా చూస్తా. లేదంటే టైమ్‌ వేస్ట్‌ కదా. ’’

తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’పైనా నాగార్జున స్పందించారు. తాను కంటెస్టెంట్‌గా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పారు. ‘‘బిగ్‌బాస్‌లో నేను కంటెస్టెంట్‌గా చేయను. నాకు ఏదైనా నచ్చకపోతే బై చెప్పి వెళ్లిపోతా. కానీ, బిగ్‌బాస్‌లో అలా కుదరదు. వందరోజులు ఉండాలి. షోలో ‘నారాయణ.. నారాయణ’ అని సరదాగా అన్నాను. అది ఎవరికీ కౌంటర్‌ కాదు. గత రెండు సీజన్లలోనూ నేను ‘నారాయణ ’అనే పదాన్ని వాడాను. అంతే తప్ప ఎవరికీ ఉద్దేశించి కాదు’’

‘‘మనం తమిళం, మలయాళం తప్పితే మిగతా భాషల్లో సినిమాల్ని అంతగా చూసేవాళ్లం కాదు.  ఎవరైనా చెబితే బెంగాలీ సినిమాని తెప్పించుకుని చూసేవాళ్లం. ఇప్పుడు జర్మన్‌, కొరియన్‌, ఫ్రెంచ్‌… ఇలా అన్ని భాషల సినిమాల్నీ చూసేస్తున్నాం. చాలామంది ఓటీటీల రాకతో సినిమా చచ్చిపోతుందని అంటుంటారు కానీ,  నా అభిప్రాయంలో మాత్రం  సినిమా మరింతగా పెరుగుతోంది. కాకపోతే అందుకు అనుగుణంగా దర్శకులు, నటులు అప్‌డేట్‌ అవుతూ ఉండాలి. లేదంటే తిరోగమనమే’’ అని నాగార్జున అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version