తనపై ఉన్న ఈడీ కేసు కొట్టివేయాలని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆస్తుల అటాచ్ ఉత్తర్వులనూ కొట్టివేయాలని కోరారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 2009లోనే మధుకాన్ గ్రూప్ కంపెనీలకు రాజీనామా చేసినట్లు తెలిపారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్‌లోనూ తన పేరు లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కౌంటరు దాఖలు చేయాలని ఈడీకి హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణ ఈనెల 9కి వాయిదా వేసింది. అయితే.. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే పేరిట టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు రుణాలు తీసుకొని దారి మళ్లించారని ఈడీ ఆరోపించింది. సుమారు రూ.361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించామని పేర్కొంది.
నామ నాగేశ్వరరావు, నామ సీతయ్య ఆధీనంలో ఆరు డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. నామ నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్తులను అటాచ్ చేసింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో గతంలో నామకు చెందిన రూ.73.43కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.