లోకేశ్ పరిస్థితి ఏమిటి… తమ్ముళ్ల ఆవేదన?

-

సరిగ్గా చెప్పాలంటే… రాజకీయాల్లో సరైన స్థానం సంపాదించుకోవాలంటే ప్రతిపక్షంలో ఉండటమే సరైన అవకాశం అని రాజకీయ పండితులు అంటుంటారు. అందుకు చాలా మంది నేతలనే ఉదాహరణగా చూపిస్తుంటారు. ఉదాహరణకు టీడీపీ అధికారంలో ఉండి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పరచుకున్న పునాదే ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తం మార్చేసిందని అంటుంటారు! జగన్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకోసం పాటుపడిన విధానం కానీ.. సమస్యలపై పోరాడిన పద్దతి కానీ.. నేడు ఈ స్థానంలో కూర్చోబెట్టాయని అంటారు! ఇదే క్రమంలో ప్రస్తుతం టీడీపీ యువనాయకులకు ఇదే సరైన అవకాశం అని అంటున్నారు రాజకీయ పండితులు.

నారా లోకేశ్ రాజకీయాల్లోకి రావడం రావడమే మంత్రి కుర్చీ ఎక్కేయడంతో.. సరైన డక్కా మొక్కీలు తినే అవకాశం రాలేదు. ఇంకా పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా లోకేశ్ మారలేదు! ఇప్పటికీ “అప్రెంటీస్ చేస్తున్న పొలిటీషియన్” గానే మిగిలిపోతున్నారు తప్ప.. ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ తరుపున సరైన సైనికుడిగా పనిచేసే అవకాశాన్ని చేజేతులా వదులుకుంటున్నారని అంటున్నారు. తనకంటూ ఒక ఐడెంటిటీని ట్విట్టర్ లో అయితే సంపాదించుకున్నారు కానీ రాజకీయాల్లో సంపాదించుకోవడంలో లోకేశ్ ఏమాత్రం కృషి చేయడం లేదనే కామెంట్లు వరుసగా వినిపిస్తున్నాయి.

వాస్తవాలను పరిశీలిస్తే… కరోనా సమయాన్ని లోకేశ్ సరిగ్గా వాడుకుని ఉంటే, కార్యకర్తలకు ఎంతో భరోసా వచ్చేది. వయసు పైబడుతున్న చంద్రబాబు స్థానంలో పార్టీని నడపగలిగే వ్యక్తి వచ్చాడని నమ్మకం కలిగేది! కానీ… ఆ సమయంలో కూడా లోకేశ్ తన చిన్నపిల్ల చేష్టలతో కాలయాపన చేశారు తప్ప.. తన కేరీర్ పై కాన్సంట్రేషన్ చేయలేదనే చెప్పాలి. ట్విట్టర్ వేదికగా రోజుకో విమర్శ చేస్తుంటారు లోకేశ్… కాని వాటిలో పస ఉండదు, రసవత్తరత అస్సలే ఉండదు. అధికార పక్షంపై విమర్శ చేస్తే… గుక్క తిప్పుకోనివ్వకుండా ఉండాలి… గతంలో జగన్ చేసింది అదే! కానీ… చప్పిడి విమర్శలు చేయడంతో లోకేశ్ ట్వీట్లు రోజు రోజుకీ కామెండీ అయిపోతున్నాయి. వీటికి ట్విట్టర్ లోనే విజయసాయి రెడ్డి లాంటివారు కౌంటర్ ఇచ్చేసి.. వాటిని అక్కడే చంపేస్తున్నారు!

ఈ క్రమంలో టీడీపీకి బలమైన నాయకుడిగా ఎదిగే ఆలోచనలు లోకేశ్ చేయని పక్షంలో… అది మునిగిపోయే నావని, ఇక నందమూరి వారే ఆ నావను ఆదుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారట. లక్షల ప్రజాధనం ఖర్చుపెట్టి తెలుగు పాఠాలు చెప్పించుకున్నా కూడా.. తెలుగు మాట్లాడలేకపోవడం తెలుగుదేశం యువనాయకుడికి ఏమాత్రం మంచిది కాదనే కామెంట్లు కూడా ఈ సందర్భంగా వినిపించడం కొసమెరుపు!! ఇకనైనా లోకేశ్ తనలో రాజకీయ పస ఉందని నిరూపించుకుంటారాని, యువ కార్యకర్తలకు ధైర్యం కలిగిస్తారని ఆశిస్తున్నారు తమ్ముళ్లు!

Read more RELATED
Recommended to you

Latest news