కరోనా మహమ్మారి భారత్‌లో రోజు రోజుకీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకు పొడిగించారు. అయితే కరోనా కేసులు లేని చోట్ల.. అంటే గ్రీన్ జోన్లతోపాటు.. ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను సడలిస్తున్నారు. ఇది గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. అయితే కొన్ని నెలల వరకు దాదాపుగా ఇదే పద్ధతిని పాటిస్తారని సమాచారం. అంటే.. లాక్‌డౌన్‌ను ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తారన్నమాట. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రస్తుతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దేశంలో ఉన్న రెడ్ జోన్లను ఆరెంజ్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా ప్రభుత్వాలు మార్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పరిస్థితులను బట్టి దాదాపుగా అన్ని రకాల ఆంక్షలను నెమ్మదిగా సడలిస్తారు. నెమ్మదిగా ఒక్కో రంగానికి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకునేందుకు అనుమతినిస్తారు. ఇక అప్పటి వరకు లాక్‌డౌన్ నిరవధికంగా కొనసాగూతూనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య సున్నా అయ్యే వరకు ఇదే విధానాన్ని పాటిస్తారని సమాచారం. ఆ తరువాత పరిస్థితులను బట్టి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారు. ఇక ఆ పరిస్థితి వచ్చేందుకు చాలా సమయమే పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అనేక మంది చేస్తున్న సర్వేల ప్రకారం.. భారత్‌లో జూన్ నెల ఆరంభం వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అంటున్నారు. ఇక జూలై, ఆగస్టులో మళ్లీ తిరగబెట్టినా.. మళ్లీ అక్టోబర్ వరకు యథాతథ స్థితి వస్తుంది. ఇక అక్టోబర్ తరువాత ఎలాగూ వ్యాక్సిన్ వస్తుందని అంటున్నారు కనుక.. అప్పటి వరకు దేశంలో ఆంక్షలతో కూడిన జీవన విధానం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఒక్క విషయం మాత్రం నిజం.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఉన్న పళంగా ఎత్తేయదు. కేసుల సంఖ్య తగ్గి సున్నా అయినా సరే.. మరికొంత కాలం లాక్‌డౌన్‌ను పొడిగించేందుకే ఎక్కువగా అవకాశం ఉందని.. నిపుణులు అంటున్నారు. ఇక అప్పటి వరకు మనం వేచి చూడక తప్పదు..!