ఏపీలో టీడీపీ మహానాడు నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారని, ఇప్పటి వరకు ప్రతిపక్షాలు.. ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తోందన్నారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ కేడర్ ఆ పార్టీ నేతలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని, పార్టీ ఆదేశిస్తే.. పాదయాత్రే కాదు.. ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామన్నారు.
ప్రజల్లోకి వెళ్తాను.. గ్రామ గ్రామానికి వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. పొత్తులనేవి ఎన్నికలప్పుడు జరిగే చర్చ అని, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలంతా కలిసి ప్రజా కంటక ప్రభుత్వాన్ని దింపాలనే భావనతోనే అందరూ కలవాలని పవన్, చంద్రబాబు వ్యాఖ్యనించారని భావిస్తున్నానన్నారు. అంతేకాకుండా.. మహానాడు అయ్యాక జగన్ చేసిన రెండు భారీ కుంభకోణాలను బయట పెడతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.