ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయింది : లోకేష్ ఫైర్

జగన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆడబిడ్డల్ని బయటకి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం కడపాలెంలో తండ్రీ, కొడుకులు మృగాళ్లా మారి బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని లోకేష్ వ్యాఖ్యానించారు.

బాధితులే నిందితుల్ని గుర్తించాలనే మహిళా హోంమంత్రి అసమర్ధ వ్యాఖ్యలు, కనీసం ఒక్క ఘటనలో కూడా నిందితులకు శిక్ష పడకపోవడం వల్లే కామోన్మాదులు రెచ్చిపోతున్నారని లోకేష్ మండి ప‌డ్డారు. మీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కోసం పోలీసుల్ని వాడుకోవడం మానేస్తే… కనీసం వారు నిందితులనైనా పట్టుకుంటారంటూ ప్ర‌భుత్వాన్ని ఉద్ద్యేశించి లోకేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా లోకేష్ రాష్ట్రంలో జ‌రుగుతున్న మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాల‌పై త‌ర‌చూ త‌న‌దైన రీతిలో స్పందిస్తున్నారు.