అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా వరుసగా వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. రామగిరి మండలం మాదాపురంలో తెలుగు తమ్ములపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మూడు రోజుల క్రితం టీడీపీకి చెందిన గంగమ్మగది సర్పంచ్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో కార్యాలయం ఆఫీసు అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమైంది. పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు గాయాలయినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని, తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని టీడీపీ సర్పంచ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ వర్గీయులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడంతో విస్మయం వ్యక్తమవుతోంది. రివర్స్ కేసులు పెట్టడంపై అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న నారా లోకేశ్.. మాదపురం సర్పంచ్‌కు ఫోన్ చేశారు. వైసీపీ దౌర్జన్యాలకు ఎవరూ భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరసా కల్పించారు. వైసీపీ నేతలు దాడి చేస్తే టీడీపీ వారిపై కేసులు పెట్టడమేంటని లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని లోకేశ్ సూచించారు.