ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయని భయపడుతున్నారో లేక, తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్‌కు ఆదరణ తగ్గుతుందని అనుకున్నారో తెలియదు గానీ, ఎప్పుడు పెద్దగా జనంలోకి రాని తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR ) ఇప్పుడు జనం మధ్యలోనే ఉంటున్నారు. కరోనా తగ్గుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తేసి మరీ, ప్రజల్లోకి వస్తున్నారు. ఇప్పటికే వాసాలమర్రి గ్రామ ప్రజలతో సహపంక్తి భోజనం కూడా చేశారు. అలాగే జిల్లాల టూర్లకు కూడా వెళుతున్నారు.
అయితే మొన్నటివరకు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు పుంజుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు టీఆర్ఎస్‌కు ధీటుగా వస్తున్నాయి, అందుకే సీఎం కేసీఆర్ సైతం జనంలోకి రావడం మొదలైందని తెలుస్తోంది. పైగా హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కేసీఆర్, ఇక నుంచి జనంలోనే ఉంటారని తెలుస్తోంది. ఇక ఏపీలో కూడా సీఎం జగన్….కేసీఆర్ రూట్‌లోనే రావాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటుతుంది. ఈ రెండేళ్ల సమయంలో జగన్, పెద్దగా జనంలోకి వచ్చిన సందర్భాలు లేవు. ఏదో పథకాల ప్రారంభ సమయంలోనే జిల్లాలు పర్యటించారు. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు. అయితే సచివాలయం లేదా తాడేపల్లి ఇంటికే జగన్ పరిమితమవుతూ వచ్చారు.
అయితే ఇక నుంచి జగన్‌కు అలాంటి పరిస్తితి ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే జగన్ కూడా బయటకు రావాల్సిన సమయం దగ్గర పడినట్లు కనిపిస్తోంది. ఇక రెండేళ్లుగా కాస్త సైలెంట్‌గా ఉన్న ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నాయకులు కూడా ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మొదలుపెడుతున్నారు.
అటు చంద్రబాబు, నారా లోకేష్‌లు కూడా జనంలోకి రావడం మొదలుపెట్టారు. ఇక ఇలాంటి తరుణంలో సీఎం జగన్ సైతం జనంలోకి రావాల్సి ఉంది. త్వరలోనే జగన్ కూడా జిల్లాల టూర్లు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా జనంలోకి వచ్చి పార్టీ పరిస్తితిని గమనించే అవకాశం లేకపోలేదు. మొత్తానికైతే ఇద్దరు సీఎంలు జనం బాట పట్టాల్సిన అవసరం వచ్చినట్లు తెలుస్తోంది.