నరసాపురం వైసీపీ ఇంఛార్జ్‌ పై సొంతపార్టీలోనే ఆసక్తికర చర్చ

-

పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలు తప్ప మిగిలిన ఎమ్మెల్యే.. ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. వైసీపీ గెలవలేని చోట.. బలమైన నాయకులకు జిల్లాస్థాయి పదవులు ఇచ్చి పార్టీ పటిష్ఠానికి చర్యలు తీసుకుంటున్నారు. కానీ.. నరసాపురం సిట్టింగ్‌ ఎంపీ పార్టీ లైన్‌కు భిన్నంగా వెళ్లిన తర్వాత అక్కడ ఇంఛార్జ్‌ బాధ్యతలను కొత్త వారికి అప్పగించింది వైసీపీ. గతంలో ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉన్న గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు వైసీపీలో చేరడంతో ఆయన్ని ఇంఛార్జ్‌ను చేసింది. కండువా కప్పీకప్పగానే ఇంఛార్జ్‌ పదవి ఇచ్చారు. కానీ పదవి చేపట్టిన వెంటనే ఆ నాయకుడు డిశ్చార్జ్‌ అయిపోయారు.

సామాజికవర్గం పరంగా బలమైన కుటుంబం.. రాజకీయ అండదండలు ఉండటంతో రంగరాజు ఇంఛార్జ్‌గా సరైన నేతగా అంతా భావించారు. కానీ.. రంగరాజు ఎందుకో యాక్టివ్‌గా లేరు. నరసాపురం లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలతోనూ ఆయన టచ్‌లో లేరని సమాచారం. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి చొరవ తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఇంఛార్జ్‌ పదవి ఇష్టం లేదో ఏమో కానీ.. ఎమ్మెల్యేలకే అందుబాటులో లేరనే విమర్శలు కూడా ఉన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుపై నరసాపురం లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం విషయంలో ఎవరికి వారుగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలు కేడర్‌ను గందరగోళ పరుస్తున్నాయి. ఇంఛార్జ్‌ రంగరాజు యాక్టివ్‌గా లేకపోవడంతో ఈ విషయంలో కన్ఫ్యూజన్స్‌ పెరుగుతున్నాయని చెబుతున్నారు. పైగా నరసాపురం లోక్‌సభ పరిధిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కలిసి పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏకాభిప్రాయం సాధ్యం కావడం లేదు. ఇక్కడి వివాదాలు అప్పడప్పుడూ సీఎం దగ్గరకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

గోకరాజు ఫ్యామిలీ పారిశ్రామికవేత్తలుగా, విద్యా వేత్తలుగా, వ్యవసాయ పరంగా ఇక్కడ బలమైన స్థానం సంపాదించింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో వారికి పరిచయాలు కూడా ఎక్కువే. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రంగరాజు ఎందుకు ముభావంగా ఉంటున్నారన్నది అర్థం కావడం లేదట. ఒకవేళ ఆయన చెప్పింది ఏదైనా ఎమ్మెల్యేలు చేయలేదా? లేక ఎమ్మెల్యేలతో మాట్లాడటానికి ఆయన ఇబ్బంది పడుతున్నారో కానీ అధికార పార్టీ నేతల మధ్య గ్యాప్‌ అయితే పెరుగుతోందని సమాచారం.

అధికార పార్టీ నేతలంటే హడావిడిగా ఉంటారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల నిర్వహణ సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. చుట్టూ మంది మార్బలం.. వాహణశ్రేణి అన్నీ ఉంటాయి. వైసీపీ ఇంఛార్జ్‌గా ఇలాంటి సదుపాయాలకు కొదవే ఉండదు. కానీ.. వాటన్నింటికీ దూరంగా ఉంటున్నారట రంగరాజు. ఈ అంశంపై మాట్లాడేందుకు పార్టీ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో నరసాపురం లోక్‌సభ పరిధిలో వైసీపీ ఇంఛార్జ్‌ ఉన్నట్టో లేనట్టో పార్టీ పెద్దలే స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version