వ్యవసాయం చేయడం ఎంతో కష్టం. రైతులు ఆరుగాలం కష్టపడితే పంట చేతికొస్తుంది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ఏ ప్రకృతి విలయమే వస్తే ఇక అంతే సంగతి. అన్నదాత నష్టపోవడమే గాక వాళ్లు పడిన శ్రమ అంతా వృథా అవుతుంది. కర్షకుల కష్టాన్ని కాస్త తగ్గించేందుకు ఇప్పుడు ఆధునిక యంత్రాలు వస్తున్నాయి. నాటు వేయడానికి, వరి కోయడానికి యంత్రాలు వచ్చాయి. అలాగే మందు పిచికారీ చేయడానికి డ్రోన్లు కూడా కొత్తగా ప్రవేశపెట్టారు. కానీ డ్రోన్లు ఉపయోగించాలంటే భారీగా నగదు అవసరం. అందుకే చాలా మంది రైతులు కష్టమైనా తామే పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. కొందరు కూలీలతో చేయిస్తున్నారు.
అయితే పొలంలో పురుగుల మందులు పిచికారీ చేయడం కాస్త శ్రమతో కూడుకున్న పని. అంతేకాకుండా పిచికారీ చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనికి ఓ రైతు మంచి ఉపాయం కనిపెట్టాడు. అందరు పంట మొక్కలకు వాడే పురుగు మందులను డబ్బాలో వేసి వీపున పెట్టుకొని పిచికారీ చేస్తుంటారు. దీనికి భిన్నంగా పైసా ఖర్చు లేకుండా ఓ వినూత్న పద్ధతిని కనిపెట్టాడు నారాయణపేట జిల్లాకు చెందిన రైతు. మరి ఆ ఉపాయం ఏంటో తెలుసుకుందామా..
పంట మొక్కలకు పురుగుమందు పిచికారీకి సంబంధించి తెలంగాణకు చెందిన ఓ రైతు వినూత్న ఆవిష్కరణ చేశాడు. సాధారణంగా అయితే మందు పిచికారీ డబ్బాను వీపునకు తగించుకొని రైతులు పిచికారీ చేస్తారు. కానీ నారాయణపేట జిల్లాలోని నర్వ మండలానికి చెందిన ఓ రైతు మాత్రం ఎద్దుల బండిపై ఓ మోటారును అమర్చి దాని ద్వారా పురుగుమందును పిచికారీ చేస్తున్నాడు.
రెండు పెద్ద డ్రమ్ములను ఓ ఎద్దులబండిపై ఉంచి వాటిల్లో క్రిమిసంహారక మందును నింపాడు. వాటికి మోటారును అమర్చి తద్వారా మందును మొక్కలకు పిచికారీ చేస్తున్నాడు. మామూలుగా అయితే స్ప్రేయర్‌ను రైతులు చేత్తో పట్టుకొని ఒక్కో మొక్కపై మందు పిచికారీ చేస్తూ వెళతారు. కానీ ఈ రైతు మాత్రం బండిపైనే రెండు స్ప్రేయర్లను అమర్చాడు.
అవి ఆటోమేటిక్‌గా తిరుగుతూ పిచికారీ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాగా ఈ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను నారాయణపేట కలెక్టర్ హరిచందన ట్విటర్లో షేర్ చేస్తూ ఆ రైతును ప్రశంసించారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ విధానం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని, కూలీల అవసరం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
Effective, labour saving, Low cost, #rural #Innovation 💡 #Agriculture sprayer from a #farmer of Narva mandal #Narayanpet.
Being nurtured & incubated under #IntintlaInnovation by @teamTSIC.#InnovationForEveryone. @jayesh_ranjan
@DrShantaThoutam pic.twitter.com/gCDngg3K0z— Hari Chandana (@harichandanaias) August 20, 2022