ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోంది : కేటీఆర్‌

-

మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రూ.వేలకోట్ల ఎమ్మెల్యేని కొన్నట్టుగా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ఆరోపించారు. అయితే, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్ తనం ఓడిపోవడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ పాదూషాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరన్న సంగతి, మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంతో మరోసారి రుజువైందని అన్నారు మంత్రి కేటీఆర్‌. అబద్ధాలకు పెద్దకొడుకు అమిత్ షానే అన్న కేటీఆర్‌.. అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని పసలేని ప్రసంగం చేశారని విమర్శించారు. అమిత్ షాతో మునుగోడు ప్రజలకు పావలా ప్రయోజనం లేదన్నారు మంత్రి కేటీఆర్‌. గాడిద గాత్రానికి ఒంటె ‘ఓహో..’ అంటే, ఒంటె అందానికి గాడిద ‘ఆహా’ అన్నట్టుగా మోదీ ప్రభుత్వ పనితీరు గురించి అమిత్ షా చెప్పుకున్నారని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. నల్లా చట్టాలతో అన్నదాతల ఉసురు తీద్దామనుకున్న బీజేపీ పార్టీ నేతలు, రైతుపక్షపాతి అయిన కేసీఆర్‌ను విమర్శించడాన్ని చూసి హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుంటుందని అన్నారు మంత్రి కేటీఆర్‌.

మొన్న నల్లచట్టాలతో దేశ రైతులకు ఉరితాడు బిగించాలనుకున్న మోదీ ప్రభుత్వం, తాజాగా విద్యుత్ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్రం చేస్తున్న కుట్రలపై కేసీఆర్ చేసిన ఆరోపణలకు మునుగోడు వేదికగా అమిత్ షా జవాబు చెప్తారని రైతాంగం ఆశించిందని, కానీ, ఆయన ఆ విషయాన్ని దాటవేశారన్నారు. దేశాన్ని ఏలుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా నుంచి అనేక అంశాలపై తెలంగాణ ప్రజలు స్పష్టతను ఆశించారని అయితే బీజేపీకి అలవాటైన తప్పించుకునే ధోరణినే ఆయన కొనసాగించారని కేటీఆర్ విమర్శించారు. అమిత్ షా ప్రసంగంలోని అనేక అంశాలు అసత్యాలు, అర్థరహితమన్న సంగతి వేదిక మీదున్న బీజేపీ నేతలకు కూడా తెలుసన్నారు మంత్రి కేటీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version