నాసా మరో అరుదైన ఘనత సాధించింది. భూమికి 33 కోట్ల కిలో మీటర్ల దూరంలో గల ఉల్క నుంచి మట్టి నమూనాను సేకరించింది. దీనిని విశ్లేషించడం ద్వారా సౌరకుటుంబానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అనేక సౌర కుటుంబాలు, పాలపుంతలతో విస్తరించిన ఈ విశ్వంలో ఇప్పటి అనేక విషయాలు అంతుచిక్కని ప్రశ్నలే. అయితే, భూమికి చేరువగా ఉన్న గ్రాహాలు, గ్రహశకలాల గురించి తెలుసు కోవడం ద్వారా ఇతర గ్రహాలపై మానవ మనుగడకు ఎంత వరకూ అవకాశం ఉందనే అంశాలను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనిలో భాగంగా బెన్ను ఉల్కపై ప్రయోగాలు చేస్తున్నారు.
భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్ను ఆస్టరాయిడ్‌పైకి ఓసిరిస్ అంతరిక్ష నౌకను పంపింది అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నానా. లాక్హీడ్ మార్టిన్ నిర్మించిన ఓసిరిస్ స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన 11 అడుగుల పొడవైన రోబోటిక్ చేయి బెన్ను ఉల్క ఉత్తర ద్రువాన్ని ముద్దాడింది. బెన్ను నుంచి 60 గ్రాముల శకలాల్ని తీసుకురావడానికి 2016లో ఓసిరిస్ వ్యోమ నౌకను పంపారు. అది రెండేళ్లుగా ఈ ఉల్క చుట్టూ పరిభ్రమిస్తోంది. ఎట్టకేలకు ఉల్కను తాకి… రాతి, మట్టి నమూనాలను సేకరించింది. దీనికి సంబంధించిన వీడియోలను నాసా విడుదల చేసింది.