మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్‌కు నోటీసు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. బీజేపీ నాయకురాలు ఇమర్తి దేవి నుద్దేశించి ఐటమ్‌వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున… ఉద్రిక్తతకు కారణమయ్యే ఏ చర్యలోనూ పార్టీ లేదా వ్యక్తులు పాల్గొనకూడదని స్పష్టం చేసింది.ఈ నియమాల ఉల్లంఘనపై కమల్ నాథ్ నుంచి వివరణ కోరింది.
గ్వాలియర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన కమల్ నాథ్, బీజేపీ అభ్యర్థిని ఇమర్తి దేవిపై విమర్శలు చేశారు. ఆమె మాదిరిగా ‘ఐటమ్’ కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి చాలా సాధారణ వ్యక్తి అని అన్నారు. దీంతో కమల్ నాథ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ఆయనను పార్టీ నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ రాశారు. కమల్ నాథ్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కూడా ఖండించారు. అయితే తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు కమల్ నాథ్ తెలిపారు.