శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్ తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటు యత్నాలను తిప్పికొట్టి, వారిపై పై చేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’ అని వివరించారు యాదవ్. ఎల్వోసీ స్థావరాల్లో దాచుకునే ఉగ్రవాదుల సంఖ్య 130-150 మధ్య మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాలను పరిగణలోకి తీసుకొని కార్యచరణ, ప్రణాళిక అమలు చేస్తామని వెల్లడించారు.