ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. పది మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని జగతరా సమీపంలో వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం.. రాయ్‌పుర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. వీరంతా కాంకేర్ జిల్లాలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారని చెప్పారు. కాగా, మృతులు ధామ్‌తరి జిల్లాలోని సోరెమ్ భట్‌గావ్ గ్రామంలో నివాసముండే ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ విషాదం గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.