ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 14మంది దుర్మరణం చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, SDRF దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను రక్షించి స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
శనివారం రోజున 26 మంది ప్రయాణికులతో టెంపో రుద్రప్రయాగ్ వైపుగా బయలుదేరింది. రైటోలి సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా టెంపో అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న SDRF, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అక్కడిక్కడికే 10 మంది మరణించారు. గాయపడిన వారిని విమానంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.