కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పరిధిలోని సేల్స్ ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా లీటర్ పెట్రోల్‌పై రూ.3 డీజిల్‌పై రూ.3.50 మేర ధర పెరిగింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. పెట్రోల్‌పై కర్ణాటక సేల్స్ ట్యాక్స్‌ను 25.92 శాతం నుంచి 29.84 శాతానికి పెంచారు.
డీజిల్‌పై అమ్మకం పన్నును 14.34 శాతం నుంచి 18.44 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. తాజా పెంపుతో కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86, డీజిల్ ధర రూ.88.94పైసలకు చేరడంతో కర్ణాటక ఖజానాకు ఏటా రూ.2,500 కోట్ల నుంచి రూ.2,800 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంధన ధరల పెంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.