భారీ వర్షాలతో సిక్కిం రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. మెరుపు వరదల వల్ల ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారీ వర్షాలతో వచ్చిన ఆకస్మిక వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఉత్తర సిక్కింలోని లోనక్ లేక్ ప్రాంతంలో కురిసిన వర్షాల ధాటికి తీస్తా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నదిలో వరద ప్రవాహం సాధారణం కంటే 15-20 అడుగులు అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
వరద ధాటికి లాచెన్ వ్యాలీలో ఉన్న సైనిక స్థావరాలు ప్రభావితమయ్యాయి. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారని రక్షణ శాఖ గువాహటి కార్యాలయం తెలిపింది. కొన్ని సైనిక వాహనాలు సైతం వరద నీటిలో మునిగిపోయాయని.. కనిపించకుండా పోయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. చుంగ్థంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్లే దిగువ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని రక్షణ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలే పేర్కొంది. సింగ్థమ్ సమీపంలోని బర్దంగ్ ప్రాంతంలో తమ ఆర్మీ వాహనాలు పార్క్ చేశామని, వరద ధాటికి అవి ప్రభావితమయ్యాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు.