గతవారం ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 280కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 278 మంది మరణించగా, వారిలో కనీసం 40 మంది విద్యుత్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మేరకు సహాయక చర్యలను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. పట్టాలు తప్పిన బోగీల్లోంచి మృతదేహాలను బయటకు తీశారు. అందులో కనీసం 40 మృతదేహాలపై గాయాలు, రక్తస్రావం కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. తమ ఎఫ్ఐఆర్లో ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడడం వల్ల.. విద్యుత్ షాక్ తగిలిందని రైల్వే పోలీసులు తెలిపారు.