– ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఆర్మీ డే వేడుకలు
– సైనికులందరికీ యావత్ భారతావని సెల్యూట్ః ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
న్యూఢిల్లీః నిస్వార్థమైన దేశ ప్రేమకు స్వచ్ఛమైన మానవత్వానికి నిదర్శనం సైనికుడు. దేశం కోసం తన ప్రాణాన్ని.. సాటి మనిషి కోసం తన జీవితాన్ని అంకితం ఇస్తాడు జవాను. కుటుంబం, భార్య, పిల్లలను విడచి.. ఎండవానలను తట్టుకునీ, మంచుకోండలను అధిరోహిస్తూ.. శత్రువులను నుంచి దేశానికి సరిహద్దు రక్షణ గోడగా నిలుస్తూ.. తన ప్రాణాలను సైతం ఆర్పించడానికి సైతం సిద్ధంగా ఉంటాడు. అలా దేశ రక్షణ కోసం వారు చేసిన ప్రాణ త్యాగాలను యావత్ భారతావని ఎన్నటికీ మరిచిపోదు.. ఆ ముద్దు బిడ్డలను చూసి భారత జాతీ గర్విస్తోంది.. అమరజవానులను తలచుకుంటూ.. నేటి ఆర్మీ డే శుభాకాంక్షలు తెలుపుతోంది..!
యావత్ భారతావని మన జవాన్ల సేవలను కొనియాడుతూ.. ఆర్మీడేను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోంటోంది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా యావత్ భారతావని నేడు (జనవరి 15 శుక్రవారం) 73వ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీనిలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు సామాజిక మాద్యమాల ద్వారా ఆర్మీ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీ నిర్వహించిన ఆర్మీడే కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ లు పాల్గొనీ, సైనికుల సేవలను కొనియాడుతూ.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. పలువురు సైనికులకు మెడల్స్ అందిచారు. కాగా, 1949లో బ్రిటిష్ అధికారుల నుంచి భారత సైన్యం బాధ్యతలు స్వీకరించింది. దీని గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డేను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని పేర్కొంటూ ఆర్మీ డే శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తికి, శౌర్యానికి సైనికులు ప్రతీకలు. మీ త్యగాలు వెలకట్టలేనివని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధాని మోడీ.. దేశ ప్రజలందరి తరఫున జవాన్లందరికీ సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. మీ నిస్వార్థ సేవకు దేశం గర్విస్తోందని తెలిపారు.