దిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో వేగం పెంచిన ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భద్రతపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం తగిన రక్షణ కల్పిస్తుందా..?అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆప్ మంత్రి ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు విపక్ష నేతలపై దాడులు మొదలయ్యాయని అన్నారు. కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు, ఆప్‌ను అణచివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ యత్నాలకు దిల్లీ వాసులే కాకుండా దేశ ప్రజలు సరైన సమాధానం చెప్తారని స్పష్టం చేశారు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని అతీశీ తెలిపారు.