చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన దేశంగా భారత్ హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన కొన్ని రోజుల తర్వాతే సూర్యుడి గురించి పరిశోధన చేయడానికి ఆదిత్య ఎల్1 వ్యోమనౌకను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నింగిలోకి పంపింది. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్1 తాజాగా.. సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని ఫొటో తీసింది.
ఆదిత్య ఎల్1లోని ‘హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్’ (హెచ్‌ఈఎల్1ఓఎస్) సౌరజ్వాలను క్లిక్‌మనిపించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం రోజున ఓ ప్రకటన జారీ చేసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటారని తెలిపింది. హెచ్‌ఈల్1ఓఎస్‌ను గత నెల 27న ఆన్ చేశామని.. ప్రస్తుతం ఈ పరికరాన్ని పూర్తిస్థాయి పరిశీలనలకు సిద్ధం చేస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇది సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చర్యలను శరవేగంగా పరిశీలించి, అధిక రిజల్యూషన్‌లో చిత్రాలను అందిస్తుందని చెప్పారు. తాజాగా అది సౌర జ్వాలలకు సంబంధించిన ఇంపల్సివ్ దశను నమోదు చేయగా.. దీని ద్వారా.. సూర్యుడిలో విస్ఫోటక శక్తి విడుదల, ఎలక్ట్రాన్ త్వరణం గురించి మరిన్ని వివరాలను అందుబాటులోకి తీసుకురావొచ్చని పేర్కొంది.