బంగ్లాదేశ్ సంక్షోభ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటు హాలులో జరిగిన ఈ భేటీలో బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిణామాలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వివరించారు. ఇప్పటివరకు భారత్ తీసుకున్న చర్యలు, ఇకముందు తీసుకోబోయే చర్యలను కూడా అఖిలపక్షానికి వివరించారు.
బంగాల్, అసోం ప్రాంతాల్లో బంగ్లా సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. గత రెండు రోజులుగా బీఎస్ఎఫ్ చీఫ్ బంగ్లా సరిహద్దుల్లోనే మకాం వేసి పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. అఖిలపక్ష భేటీ తర్వాత ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ భేటీకి అధికార పక్షం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, వేణుగోపాల్‌తోపాటు ఎస్పీ, టీఎంసీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన విద్యార్థుల ఆందోళనలు హింసాత్మికంగా మారి చివరకు ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసే వరకు దారి తీశాయి.