దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహాంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయటాన్ని అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఇది ‘చెత్తకుండీ’ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ వర్మ నివాసంలో లెక్క చూపని రూ.15 కోట్ల బయటపడినట్లు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది అనిల్ తివారీ పేరుతో ఓ తీర్మానం చేశారు. జడ్జిల కొరత ఇతర సమస్యలతో కొత్త కేసులపై విచారణ జరపలేకపోతున్నామంటూ అనిల్ తివారీ వాపోయారు. ఫలితంగా న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతమాత్రాన అలహాబాద్ హైకోర్టు చెత్తకుండీ కాదని.. తాము అవినీతి అంగీకరించబోమని స్పష్టం చేశారు.