టూర్ల పేరుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం. అక్కడ తక్కువ ధరకు డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేయడం.. తిరిగి హైదరాబాద్ వచ్చి ఇక్కడ భారీ ధరలకు విక్రయించడం. ఇది కొందరు విద్యార్థులు ఇటీవల డ్రగ్స్ స్మగ్లింగ్ కు ఎంచుకుంటున్న మార్గం. విద్యార్థులే ఏజెంట్లుగా డ్రగ్స్ విద్యాసంస్థల పరిసరాలకు చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విహారయాత్రల మాటున బైకులపై వెళ్లి తిరిగొచ్చేటప్పుడు గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజాగా ఘట్‌కేసర్‌లోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి ఆబ్కారీ ఎస్‌టీఎఫ్ అధికారులకు గంజాయి తీసుకొస్తూ దొరికిపోయాడు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న నిందితుడు బీదర్‌కు వెళ్లి గంజాయి కొని.. హైదరాబాద్‌కు తీసుకొచ్చి కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. కాలేజీలకు మత్తు దందా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాటిని హాట్ స్పాట్లుగా గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచుతోంది. నిందితుల కదిలికల మీదా నిఘా ఉంచుతూ .. వారిని పట్టుకుంటున్నారు. డ్రగ్స్ సేవించే వారి డేటా సేకరించి వారు ఎవరితో మాట్లాడుతున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు వంటి విషయాలపై నిఘా పెడుతున్నారు. తనిఖీలు, మూత్ర నమూనాలతో గుట్టు కనిపెడుతున్నారు.