విడాకుల వ్యవహారంలో అందించే మనోవర్తిపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.. ఉద్యోగం లేకున్నా.. మాజీ భార్యకు భరణం ఇవ్వడం భర్త బాధ్యత అని స్పష్టం చేసింది. కూలీ పనిచేసైనా మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది. తనకు ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేనన్న పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. యూపీకి చెందిన జంటకు 2015లో వివాహం అయ్యింది. వరకట్నం కోసం తన భర్త, అత్తామామలు వేధిస్తున్నారని 2016లో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసి నెలకు 2వేల మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును అతడు 2023లో హైకోర్టు సవాలు చేశాడు. తన మాజీ భార్య టీచర్‌గా నెలకు 10వేలు సంపాదిస్తుందనే విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నాననీ.. అద్దె నివాసంలో ఉంటున్న తనపై తల్లిదండ్రులు, సోదరీమణులు కూడా ఆధారపడ్డారని విన్నవించాడు. అయితే, భార్య నెలకు 10వేలు సంపాదిస్తుందని రుజువు చేయలేకపోయాడు. ఫలితంగా అలహాబాద్ హైకోర్టు మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది.