మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సాహిల్కు సహకరించిన ఓ పోలీసుల అధికారిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మరో అధికారి కూడా భాగమైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. షకీల్ కుమారుడు తప్పించుకునేందుకు సీఐ ప్రేమ్ కుమార్ సహకరించారని తెలిపారు. షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
“గత నెల 23 అర్ధరాత్రి మితిమీరిన వేగంతో కారు నడిపిన షకీల్ కుమారుడు సాహిల్ హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పారిపోయేందుకు సాహిల్కు పంజాగుట్ట సీఐ దుర్గారావు, షకీల్ అనుచరులు సహకరించారు. రోడ్డు ప్రమాదం తర్వాత పంజాగుట్ట సీఐతో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ మాట్లాడారు. ఇద్దరి సీఐల కాల్ రికార్డును స్వాధీనం చేసుకున్న తర్వాత దర్యాప్తు చేసి ప్రేమ్ కుమార్ను అరెస్టు చేశాం. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశాం.” అని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.