రామమందిర ఉద్యమం లేకుండా దేశ చరిత్రను చదవలేమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 1528 నుంచి ప్రతితరం ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమాన్ని చూసిందని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడారు. 5 శతాబ్దాల నుంచి కొనసాగిన ఈ కలనుమోదీ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22వ తేదీ వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.
అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లౌకికవాదాన్ని చాటిచెప్పిందని అమిత్ షా అన్నారు. దేశం కలలుగన్న అయోధ్య ఆలయం మోదీ ప్రభుత్వ హయాంలో సాకారమైందని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రధాని 11 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేపట్టాని గుర్తు చేశారు. ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ.. జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ నవ భారత ప్రయాణానికి నాంది అని చెప్పారు. శ్రీరాముడి లేని భారతాన్ని ఊహించుకునేవారికి మన దేశం గురించి పూర్తిగా తెలియదని మండిపడ్డారు. వారు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ఇంకా వలసవాద రోజుల్లోనే ఉన్నారని విమర్శించారు. చరిత్ర గురించి తెలుసుకోని వారికి ఎలాంటి గుర్తింపు ఉండదని పేర్కొన్నారు.