చత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ అడవి ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి భద్రతా బలగాలు – మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు నేడు ఉదయం గంగలూర్ అడవి ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 8:30 గంటల ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు – నక్సల్స్ కి మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల భద్రాచలంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో 20 మందికి పైగా మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నాయకులు, ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చలపతి కూడా ఉండడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దానికి కొనసాగింపుగా దండకారణ్యంలోకి భద్రతా బలగాలు చొచ్చుకొని పోయి మావోయిస్టుల శిబిరాలను స్వాధీనం చేసుకొని వారిని మట్టుపెడుతున్నారు.