అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. మరో ఆరు రోజుల్లో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురించి కీలక విషయాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తాజాగా వెల్లడించారు.
రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతాయని చంపత్ రాయ్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నట్లు వెల్లడించారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఒంటిగంటకల్లా ఇది పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్… ఈ ముహూర్తాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఇతర ప్రముఖుల సమక్షంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని చంపత్ రాయ్ వెల్లడించారు.