ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. దాదాపు ఏడు వేల మందికి ఆహ్వానం పంపినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. మరోవైపు ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
మరోవైపు ఈ వేడుకను నేరుగా తిలకించేందుకు అందరికీ సాధ్యం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలోనూ లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ విషయాన్ని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ స్పీచ్ ను కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.