అచ్చెన్నాయుడుపై ఐఏఎస్ ను దింపుతున్న వైసీపీ

-

2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలవడమే లక్ష్యంగా అభ్యర్థులను మార్చుకుంటూ వెళుతోంది వైసీపీ.సర్వేల ఆధారంగా సీఎం జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఇన్‌చార్జ్‌లను మార్చిన పార్టీ మరి కొంతమందిని మార్చేందుకు సిద్ధమయ్యారు.దాదాపు 65 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పులు ఉంటాయని చెప్పిన దానికి అనుగునంగానే వరుసగా వైసీపీ నుంచి జాబితాలు వస్తున్నాయి. చాలా చోట్ల అభ్యర్థులను మారుస్తున్నారు. కొంతమందిని తొలగిస్తున్నారు. రెండో జాబితాలో ఏకంగా ఐదుగురు ఎంపీలను అసెంబ్లీకి పంపించిన జగన్ కీలక నియోజకవర్గాలపై మరింత దృష్టి పెడుతున్నారు.

వైఎస్సార్సీపీపై, సీఎం జగన్‌మోహనరెడ్డిపై మాటలతో విరుచుకుపడే తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్నెన్నాయుడుపై ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నారు సీఎం. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఓ ఐఎఎస్ ను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోటీకి నిలబెడుతున్నారు.ఇది పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న అరుణ్‌కుమార్‌ను టెక్కలి నుంచి పోటీలో నిలపాలని వైఎస్సార్సీపీ అధిష్టానం యోచిస్తోంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ కళింగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.ఈ కమ్యూనిటీ శ్రీకాకుళంజిల్లాలో బలంగా ఉంది. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఆయనను ఓడించడమే లక్ష్యంగా కళింగ కమ్యూనిటి నుంచి వ్యక్తిని బరిలోకి దింపుతున్నారు.

అరుణ్ కుమార్ ద్వారా అచ్చెన్నాయుడు కి చెక్ పెట్టే దిశగా సీఎం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న దువ్వాడ వాణి గెలిచే అవకాశం లేదన్న అంచనాతో ఈ మార్పు చేయబోతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ గెలవడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చిన వైకాపా నాయకత్వం కొత్త అభ్యర్థిని తీసుకొస్తోంది.

అరుణ్ కుమార్‌ను శ్రీకాకుళం ఎంపీ స్థానానికి కూడా పరిశీలిస్తున్నారు. కొంతకాలంగా వైఎస్సార్పీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి మళ్లీ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఆవిడ కూడా టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సై అంటున్నారు. వీళ్లిద్దరిలో ఒకరు ఎంపీగా, మరొకరు టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news