2023లో భక్తులకు అయోధ్య రాముడి దర్శనం: 2025లో పూర్తికానున్న భవ్య మందిరం

రామ భక్తులకు శుభవార్త. 2023, ఆఖరులో అయోధ్య శ్రీరాముడి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. కానీ, 2025లో భవ్య రామమందిర నిర్మాణం పూర్తికానున్నట్లు తెలుస్తున్నది. ఒకవైపు రామ మందిర నిర్మాణ పనులు జరుగుతుండగా మరోవైపు భక్తులు దైవ దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. 2023, ఆఖరి వరకు గర్భగుడికి అంతిమ రూపం వస్తుందని, 2025లో ఆలయ నిర్మాణం మొత్తం పూర్తవుతుందని రామ మందిర్ ట్రస్టు తెలిపింది.

Ram Mandir
Darshan of Lord Rama in Ayodhya | అయోధ్య రాముడి దర్శనం

అయోధ్యలో 110 ఎకరాల విస్తీర్ణంలో రామాలయాన్ని నిర్మిస్తున్నారు. భవ్య మందిర నిర్మాణం కోసం రూ.1000కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రధాన ఆలయ నిర్మాణంలో ఎక్కడా స్టీల్ వినియోగించడం లేదు. పూర్తిగా రాతితోనే నిర్మిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, దస్తవేజులు భద్రపరిచే గదులు ఉండనున్నాయి. భూకంపాల తాకిడికి గురికాకుండా ఉండేలా ఆలయ నిర్మాణానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని పలు ఐఐటీలను రామ మందిర్ ట్రస్టు కోరింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. కానీ, ప్రతిపాదిత ఆలయ స్థలం భూగర్భంలో నీటి ఉనికిని కనుగొనడంతో ఈ ఏడాది జనరిలో పనులను ప్రారంభించారు.