అమీర్‌ఖాన్‌ను ఎదుర్కొనే దమ్ము ఉందా ? ఫార్మా కంపెనీలకు రామ్‌దేవ్‌ బాబా సవాల్‌..

ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశంలోని అల్లోపతి డాక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా క్షమాపణలు చెప్పాలని ఐఎంఏ డిమాండ్‌ చేసింది. ఆయనపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే ఆ తంతు కొనసాగుతుండగానే రామ్‌దేవ్‌ బాబా మరో బాణం సంధించారు.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ గతంలో సత్యమేవ జయతే అనే టీవీ షో చేసిన సంగతి తెలిసిందే. అందులో అనేక రంగాలకు చెందిన వ్యక్తులతో ఆయన మాట్లాడుతూ సమాజంలోని లోటుపాట్లను, అవినీతిని బయట పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే డాక్టర్‌ సమిత్‌ శర్మ అనే వైద్యుడితోనూ గతంలో అమీర్‌ఖాన్‌ ఆ షోలో మాట్లాడారు. అందులో శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 40 కోట్ల మంది మెడిసిన్‌ను కొనలేరని, ఒక నెలకు కావల్సిన బ్లడ్‌ క్యాన్సర్‌ మెడిసిన్‌ ఖరీదు రూ.1.25 లక్షలు ఉంటుందని, అదే జనరిక్‌ మెడిసిన్ అయితే రూ.10వేలే అవుతుందని, అలాంటప్పుడు మెడిసిన్ల ధరల్లో అంతటి భారీ వ్యత్యాసం ఎందుకని అన్నారు.

అయితే డాక్టర్‌ శర్మ మాట్లాడిన ఆ మాటలతో ఉన్న వీడియోను రామ్‌దేవ్‌ బాబా షేర్‌ చేశారు. తాను మెడికల్‌ మాఫియా గురించి ప్రశ్నిస్తే ఐఎంఏ తనపై దాడి చేస్తుందని, నటుడు అమీర్‌ఖాన్‌ గతంలోనే అలా చేశారని, మరలాంటప్పుడు ఆయనపై ఐఎంఏ ఎందుకు దాడి చేయలేదని, ఆయనను ఎదుర్కొనే దమ్ము ఐఎంఏకు లేదా ? అని రామ్‌దేవ్‌ బాబా ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై ఐఎంఏ స్పందించింది. రామ్‌దేవ్‌ బాబా దేశంలోని అల్లోపతి డాక్టర్లపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే ఆయనపై వేసిన పరువు నష్టాన్ని తాము ఉపసంహరించుకుంటామని ఐఎంఏ స్పష్టం చేసింది. మరి బాబా రామ్‌దేవ్‌కు, ఐఎంఏకు మధ్య మాటల యుద్ధం ఇక్కడితో ముగుస్తుందా, లేదా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.