కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఇటీవల ట్రైనింగ్ వైద్యురాలు హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అభయ ఘటనపై రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నేడు బెంగాల్ అసెంబ్లీలో అపరాజిత స్త్రీ, శిశు సంరక్షణ ( అత్యాచార నిరోధక) యాంటీ రేప్ బిల్లును ప్రవేశపెట్టారు సీఎం మమతా బెనర్జీ. ఈ బిల్లుపై సుమారు రెండున్నర గంటల పాటు చర్చించారు. హత్యాచార నిందితులకు మరణ దండన విధించే రీతిలో బిల్లులో ప్రతిపాదనలు చేశారు.
ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారానికి పాల్పడితే వారికి పది రోజులలో ఉరిశిక్ష వేయడమే ఈ చట్టం లక్ష్యమని వివరించారు సీఎం మమతా బెనర్జీ. ఈ మేరకు సోమవారం నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.